మా సొమాలియా తాతలు ఒకసారి నాకు చెప్పిన కథ ఇది (నాకు సొమాలియా తాతలేంటా అని మీరు ఆశ్చర్యపోతే..ఈ టపా చదివి మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి). నాకు వాళ్ళ కథలంటే చాలా ఇష్టం ఎందుకంటే చాలా క్లుప్తంగా, అనుభవసారముతో నిండి ఉంటాయి.
అనగనగా ఒక చిన్న సొమాలీయా పల్లెటూళ్లో వృద్ధాప్యంలో ఉన్న అబ్దివలీ, ఎదుగుతున్న తన చిన్న కొడుకు సమతర్ కు, తను టపా కట్టేలోపల లోకజ్ఞానం నేర్పి జీవితాన్ని ఎదుర్కునేందుకు సంసిద్ధం చేయాలనుకుంటాడు.
ఒకరోజు, “అబ్బాయి సమతర్! మన గాడిదను సిద్ధం చెయ్యి. పక్క ఊరికెళ్ళి పనులు చూసుకొనివద్దాం” అన్నాడు. సమతర్ గాడిదకు మేత పెట్టి, నీళ్ళు తాపి సిద్ధం చెయ్యగానే దాన్ని పక్కఊరి దాకా నడిపించుకుంటూ వెళ్లి, పనిచూసుకొని వచ్చిన తర్వాత, ఊర్లోకి వెళ్లి మన గురించి జనాలు చెట్టుకింద చాయ్ తాగుతూ ఏం మాట్లుడుకుంటున్నారో కనుక్కొని రమ్మని పురమాయిస్తాడు. సమతర్ తండ్రి వద్దకు తిరిగి వచ్చి ” నాన్నా, అబ్ది వలీ, ఆయన కొడుకూ ఎంత వెర్రివాళ్ళో! గాడిదను పక్కన పెట్టుకుని నడిపించుకొని వెళ్లివచ్చారు అని అనుకుంటున్నారు” నివేదించాడు, కొడుకు. తండ్రి సరే అని ఊరుకున్నాడు.
మర్నాడు తిరిగి పనిమీద పక్కూరి కెళుతూ, కొడుకును గాడిదమీద ఎక్కించి, తను గాడిదను నడిపించుకుంటూ వెళ్లి వచ్చి, జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకొని రమ్మని సమతర్ను పంపిస్తాడు తండ్రి. కొడుకు తిరిగి వచ్చి “అబ్ది వలీ కొడుక్కు పెద్దలంటే అస్సలు గౌరవంలేదు చూడూ.. తను దర్జాగా గాడిదనెక్కి కూర్చుని ఎలా ముసలి తండ్రిని నడిపించాడో అని ఆడిపోసుకుంటున్నారని వార్త మోసుకొచ్చాడు.
మూడో రోజు అబ్దివలీ, కొడుకును, గాడిదను నడిపించమని, గాడిద పైకి ఎక్కి యధాప్రకారాంగా పక్కూరి కెళ్ళి పనులు చూసుకొని వచ్చారు. ఈ సారి కొడుకు ” నాన్నా! అందరూ, అబ్దివలీ ఎంత జాలిలేనివాడు, కొడుకును ఎండలో నడిపించి తను గాడిదపై ఎక్కి కూర్చున్నాడు అని నిన్ను ఆడిపోసుకుంటున్నారు ” అని నివేదించాడు. తండ్రి ఉలకలేదు, పలకలేదు. “ఆహా! అలాగా?” అని ఊరుకున్నాడు.
నాలుగో రోజు గాడిదపై ఇద్దరూ ఎక్కి కూర్చొని యధాప్రకారంగా తిరిగి వచ్చారు. కొడుకు ఊర్లోకెళ్ళి విషయాలు కనుక్కొని వచ్చి “నాన్నా! అందరూ, అబ్దివలీ, ఆయన కొడుకూ ఎంత కనికరం లేని కసాయి వాళ్లు, పాపం! ఆ మూగ జంతువుపై దర్గాగా ఎక్కికూర్చున్నారని నన్ను కొట్టడానికి వచ్చారు” అని విన్నవించుకున్నాడు. తండ్రి ఒక చిన్న నవ్వు నవ్వి, “చూశావా! నువ్వేది చేసినా, లోకులు ఏదో ఒకటి అంటూనే ఉంటారు..కాబట్టి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని “ తన అనుభవ సారాన్ని కొడుక్కు కలకాలం గుర్తుండే పాఠంగా మిగిల్చాడు. బద్ధకం వదిలితే భవిష్యత్తులో మరికొన్ని కథలు..


